వరంగల్ నగరానికి గుడ్‌న్యూస్.. రూ.530 కోట్లతో తాగునీటి పనులు:
హనుమకొండ హంటర్ రోడ్ పరిధిలోని 49వ డివిజన్‌లో లెక్చరర్స్ కాలనీ, సాయి బృందావన్ కాలనీల్లో వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, GWMC కమిషనర్ వెంకన్నతో కలిసి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మొక్కల సంరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఒక్కో డివిజన్‌కు రూ.10-12 కోట్ల పనులు:
వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. గత రెండున్నరేళ్లలో నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌లో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. గతంలో ఒక్కో డివిజన్‌కు రూ.50 లక్షలు కేటాయించేవారని, ప్రస్తుతం రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు నిధులు అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు. శాయంపేట ప్రాంతంలో సుమారు రూ.20 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
అండర్‌గ్రౌండ్ డ్రైనేజీకి టెండర్ ప్రక్రియ:
వరంగల్ నగరానికి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ తీసుకురావడం తన ప్రధాన లక్ష్యాల్లో ఒకటని నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో భారీ వ్యయంతో ప్రాజెక్టు మంజూరైందని, ప్రస్తుతం టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. డ్రైనేజీ, నీటి పైప్‌లైన్లు, సెంట్రల్ లైటింగ్ వంటి మౌలిక వసతులను సమగ్రంగా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం వేసే శాశ్వత రోడ్లను కొద్దికాలానికే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ కోసం తిరిగి తవ్వాల్సిన పరిస్థితి రాకుండా ప్రజలు సహకరించాలని కోరారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత రోడ్లు, డ్రైనేజీలు, పైప్‌లైన్లను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
తాగునీటికి రూ.530 కోట్లతో పనులు:
నగరంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రూ.530 కోట్లతో పనులు ప్రారంభించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్‌లోని పాత నీటి నిల్వ వ్యవస్థలను ఆధునీకరించడంతో పాటు అవసరమైన చోట కొత్త నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు.
పచ్చదనం కోసం ప్రజల భాగస్వామ్యం:
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్క నాటి దాని సంరక్షణకు బాధ్యత వహించాలని సూచించారు. GWMC కమిషనర్ వెంకన్న మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని కాపాడటం కూడా ముఖ్యమన్నారు. ప్రజలు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే నగర అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని తెలిపారు.


