వరంగల్: రైలు ప్రయాణంలో పొరపాటున జారిపడిపోయిన విలువైన బ్యాగును వరంగల్ GRP (గవర్నమెంట్ రైల్వే పోలీస్) సిబ్బంది అతి తక్కువ సమయంలోనే వెతికి పట్టుకుని బాధితురాలికి అందజేశారు.
ఈ రోజు (07-05-2026) ఉదయం గుడివాడ నివాసి అయిన గెల్లి శ్రీదేవి (భర్త సురేంద్రనాథ్) బీదర్ ఎక్స్‌ప్రెస్ (Tr.No 12749) లో ప్రయాణిస్తుండగా, అర్ధరాత్రి సుమారు 02:00 గంటల సమయంలో చింతలపల్లి – వరంగల్ రైల్వే స్టేషన్ల మధ్య ఆమె హ్యాండ్‌బ్యాగ్ రైలులో నుండి జారి పడిపోయింది. ఒక ఒప్పో (Oppo) మొబైల్, ₹10,000 నగదు మరియు ఇతర ముఖ్యమైన వస్తువులు బ్యాగులో ఉన్నాయి. వాటి విలువ సుమారు ₹40,000 పైచిలుకు.
బాధితురాలు వరంగల్ రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, IRP-వరంగల్ శ్రీ పి. సురేందర్ గారి ఆదేశాల మేరకు పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు.
RHC కె. భాస్కర్ పర్యవేక్షణలో ఆన్-డ్యూటీ కానిస్టేబుళ్లు ఎండీ. నయీం పాషా మరియు ఎస్.కే. పాషాలు రైల్వే ట్రాక్ వెంట గాలింపు చేపట్టారు.
వరంగల్ స్టేషన్ నుండి ధర్మారం గేటు వైపు సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాక్ వెతకగా, ఉదయం 07:00 గంటల ప్రాంతంలో సిమెంట్ కలర్ హ్యాండ్‌బ్యాగ్ లభ్యమైంది.
దొరికిన బ్యాగును మరియు అందులోని వస్తువులను పోలీసులు నిర్ధారించుకుని, బాధితురాలు గెల్లి శ్రీదేవికి సురక్షితంగా అప్పగించారు. సకాలంలో స్పందించి తన పోగొట్టుకున్న సొత్తును తిరిగి అప్పగించిన వరంగల్ GRP పోలీసులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు అభినందించారు.


