వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) కమిషనర్ వెంకన్న శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నగరంలో పారిశుధ్యం మెరుగుపరచడం, అభివృద్ధి పనులను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఆయన ఈ పర్యటన నిర్వహించారు.
జంతు వధశాలలు, కల్వర్టు పనుల పరిశీలన
పర్యటనలో భాగంగా కమిషనర్ మొదటగా కాజీపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను సందర్శించారు. అనంతరం కాజీపేటలోని మేకలు, గొర్రెల వధశాలలను క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడ నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు.
ఆ తర్వాత హనుమకొండ ప్రెస్ క్లబ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న కల్వర్టు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ స్థానిక కల్వర్టు పనుల్లో వేగం పెంచాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.
ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి
అనంతరం వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆవరణను కమిషనర్ వెంకంత సందర్శించి, అక్కడ జరుగుతున్న పారిశుధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులకు ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాల్లో పారిశుధ్య పనులను ఎలాంటి జాప్యం లేకుండా నిరంతరం నిర్వహించాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.
ఈ పర్యటనలో కమిషనర్‌తో పాటు పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Warangal News and Latest Politics News and Real Estate

