వరంగల్: వరంగల్ నగరంలో భారీ ఆర్థిక మోసం వెలుగుచూసింది. సుమారు రూ. 7 కోట్ల మేర డబ్బులతో ఓ వ్యాపారి రాత్రికి రాత్రే ఉడాయించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళ్తే… వరంగల్ పరిధిలోని కాశిబుగ్గ 19వ డివిజన్‌కు చెందిన ఓ వ్యాపారి కిరాణా షాపు నిర్వహిస్తూనే, మరోవైపు నెలవారీ చిట్టీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కొనసాగించేవాడు. స్థానికులు, పరిచయస్తులు పలువురు అతని వద్ద పెద్ద ఎత్తున చిట్టీలు కట్టడంతో పాటు, మరికొందరు వ్యాపార అవసరాల నిమిత్తం కోట్ల రూపాయలను అప్పుగా ఇచ్చినట్లు సమాచారం.
ఈ క్రమంలో నమ్మకం కుదిర్చి భారీగా నిధులు సేకరించిన సదరు వ్యాపారి, గత నెల 25వ తేదీన ఎవరికీ చెప్పకుండా కుటుంబంతో సహా ఇల్లు వదిలి పరారయ్యాడు. వ్యాపారి ఆచూకీ లభించకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బాధితులు పోలీసులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.


