వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై రైతులు ఉధృతమైన నిరసన చేపట్టారు. రాయపర్తి మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోళ్లను తక్షణమే వేగవంతం చేయాలని కోరుతూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మార్కెట్‌లో పంటను అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులకు ఇబ్బంది కలిగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.
ప్రభుత్వం స్పందించి కొనుగోలు ప్రక్రియను ముమ్మరం చేసే వరకు రైతులకు అండగా పోరాడుతామని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు.


