హన్మకొండ:నగరంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పారిశుధ్య కార్మికులకు మేయర్ గుండు సుధారాణి కీలక ఆదేశాలు జారీ చేశారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి ఒంటిపూట పని విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎండల తీవ్రత దృష్ట్యా పారిశుధ్య, మలేరియా సిబ్బందికి వెసులుబాటు కల్పించారు. పనివేళలు తగ్గినప్పటికీ, సిబ్బంది తమ విధులను విధిగా మరియు బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఆమె సూచించారు. నగరంలో డ్రైనేజీల పూడికతీత పనుల కోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశామని, ఈ ప్రక్రియను రాబోయే 15 రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన గడువు విధించారు.
ఎండల వల్ల సిబ్బంది అస్వస్థతకు గురికాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మేయర్ స్పష్టం చేశారు. నగర పరిశుభ్రత విషయంలో రాజీ పడకుండానే, క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.


