వరంగల్: జిల్లాలో కొన్ని మెడికల్ షాపులు నిబంధనలను బేఖాతరు చేస్తూ అక్రమ మార్గంలో కాసుల వేట సాగిస్తున్నాయి. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే అత్యంత ప్రమాదకరమైన మత్తు కలిగించే మందులను విక్రయిస్తూ యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయి.
వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలోని ఒక మెడికల్ షాపులో అక్రమంగా మత్తు మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు, తక్షణమే సదరు షాపును సీజ్ చేశారు. ఇటీవల హన్మకొండలో మత్తులో ఉన్న కొందరు యువకులను నార్కోటిక్ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఈ వికృత రూపం వెలుగులోకి వచ్చింది. వారిని విచారించగా మెడికల్ షాపుల గుట్టు రట్టయింది.
గతంలో కాజీపేటలో కూడా ఇలాంటి సంఘటనే జరగగా, ఇప్పుడు ఏకంగా నగర నడిబొడ్డున ఉన్న షాపుపై చర్యలు తీసుకోవడం సంచలనంగా మారింది.
డాక్టర్ల సలహా లేకుండా మందులు అమ్మడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.


