వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఇసుక అడ్డ పోర్ట్ రోడ్ ప్రాంతంలోని రాజశ్రీ గార్డెన్స్‌లో ఎర్రబెల్లి ప్రదీప్ రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ ఎర్రబెల్లి వినీత్ రావు ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో జరిగిన ఈ శిబిరానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
1500 మందికి కంటి పరీక్షలు:
శిబిరానికి సుమారు 1,500 మంది పేద, మధ్యతరగతి ప్రజలు హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల అనంతరం 1,000 మందికి పైగా అవసరమైన వారికి కంటి అద్దాలను అందించారు. రెటీనా సమస్యలు, ఇతర కంటి శస్త్రచికిత్సలు అవసరమైన సుమారు 100 మందిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.
పేదలకు నాణ్యమైన వైద్యం:
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే ట్రస్ట్ ప్రధాన లక్ష్యమన్నారు. గతంలో కాశిబుగ్గలో నిర్వహించిన తొలి విడత కంటి వైద్య శిబిరానికి కూడా మంచి స్పందన లభించిందని తెలిపారు.
మరిన్ని సేవా కార్యక్రమాలు:
కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని ప్రదీప్ రావు సూచించారు. భవిష్యత్తులోనూ మరిన్ని ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు అండగా నిలుస్తామని చెప్పారు. శిబిరానికి సహకరించిన శంకర్ కంటి ఆసుపత్రి సిబ్బంది, క్రీడో లైఫ్ సైన్స్ డైరెక్టర్ ఆలూరు వంశీకృష్ణకు ఎర్రబెల్లి వినీత్ రావు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో మాజీ మేయర్ తక్కెళ్లపల్లి రాజేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, పలువురు బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


