హైదరాబాద్: బైండ్ల సమాజం విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మరింత ముందంజ వేయాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పిలుపునిచ్చారు. సమాజంలో ఐక్యతను పెంపొందించడంతో పాటు, యువత ఉన్నత విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రాంగణంలో ‘తెలంగాణ బైండ్ల ఉద్యోగుల సంఘం’ (BEAT) ఆధ్వర్యంలో నిర్వహించిన “విజన్ మీట్–2026” కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ, సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన తాను నేడు పార్లమెంట్ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించడానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలే కారణమని పేర్కొన్నారు. కేవలం కులవృత్తి ద్వారా తాత్కాలిక ఆదాయం వస్తోందనే కారణంతో పిల్లల చదువులను మధ్యలోనే ఆపేయవద్దని, ప్రతి ఒక్కరూ ఉన్నత, వృత్తి విద్యలను అభ్యసించాలని ఆకాంక్షించారు.
ముఖ్యంగా ఆడపిల్లల చదువుకు తల్లిదండ్రులు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చి, వారు జీవితంలో సొంతకాళ్లపై నిలబడేలా ప్రోత్సహించాలని కోరారు. సమాజం ద్వారా ఎదిగిన ప్రతి ఒక్కరూ ‘పే బ్యాక్ టు సొసైటీ’ స్ఫూర్తితో వెనుకబడిన వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
బైండ్ల భవన్‌కు రూ.2 కోట్ల నిధులు
హైదరాబాద్‌లో బైండ్ల భవన్ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని తాను, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని విన్నవించినట్లు ఎంపీ తెలిపారు. తొలి విడతగా సుమారు రూ.2 కోట్ల నిధులు కేటాయించాలని కోరామని, త్వరలోనే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారిక జీవో (GO) వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
గ్రూపులు వీడి ఒక్కటిగా ముందడుగు వేయాలి
బీఈఏటీ (BEAT) సంస్థను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బైండ్ల ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, యువతను ఒకే తాటిపైకి తీసుకురావాలని సూచించారు. సంఘంలో ఎలాంటి గ్రూపులు, విభేదాలకు తావులేకుండా అందరూ సమైక్యంగా ముందుకు సాగాలని, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించి సభ్యత్వాన్ని పెంచాలని కోరారు. బైండ్ల సమాజాభివృద్ధికి బీఈఏటీ వేదికగా నిలవాలని స్పష్టం చేశారు.
తన కుటుంబానికి పెద్దగా ఆస్తులు, ఆర్థిక వనరులు లేకపోయినా నిజాయితీ, ప్రజాబలమే పెట్టుబడి అని ఎంపీ అన్నారు. తన తండ్రి కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా, తాను ఎంపీగా ప్రజాసేవలో ఉన్నామని, రాజకీయ పదవులు ఉన్నా లేకపోయినా సమాజ శ్రేయస్సుకు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ విజన్ మీట్ కార్యక్రమంలో బీఈఏటీ అధ్యక్షుడు చినపాక స్వామి, ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ, కోశాధికారి డా. జీలకర్ర స్వామి, సంయుక్త కార్యదర్శి జీలకర్ర రామ్మూర్తి, ముఖ్య సలహాదారు కడెం ధనుంజయ, సలహాదారులు డా. జీలకర్ర సోమశేఖర్, చినపాక శ్రీనివాస ప్రసాద్, ఏ. ప్రదీప్ కుమార్ తదితర సంఘ నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

