హనుమకొండ అశోక కాంప్లెక్స్‌లో నవచేతన బుక్ హౌస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రారంభించారు. జాతీయ పుస్తక వారోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పుస్తకాలు మనిషికి మంచి నేస్తాలని, పుస్తక పఠనం విజ్ఞానం, ఆలోచనా శక్తి, సృజనాత్మకతను పెంపొందిస్తుందని అన్నారు. డిజిటల్ యుగంలోనూ పుస్తక పఠనానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, విద్యార్థులు, యువత ప్రతిరోజూ పుస్తకాలు చదివే అలవాటు చేసుకోవాలని సూచించారు.
అనంతరం పుస్తక ప్రదర్శనలోని వివిధ విభాగాలను సందర్శించి, పలు పుస్తకాలను పరిశీలించి స్వయంగా కొనుగోలు చేశారు. పఠన సంస్కృతిని ప్రోత్సహిస్తున్న నవచేతన బుక్ హౌస్ నిర్వాహకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, సీనియర్ జర్నలిస్టులు గడ్డం కేశవమూర్తి, గడ్డం రాజిరెడ్డి, వల్లాల వెంకటరమణ, వేణుమాధవ్, తోట సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


