ప్రభుత్వ వైద్య సంస్థల్లో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కొరతపై కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పించుకోవడం సమంజసం కాదని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం లోక్సభలో వరంగల్ ప్రభుత్వ వైద్య కళాశాల, మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆసుపత్రితో పాటు కేంద్ర సహకారంతో నడిచే ప్రభుత్వ వైద్య సంస్థల్లో సిబ్బంది కొరతపై ఆమె ప్రశ్న లేవనెత్తారు.
ఆయా సంస్థల్లో మంజూరైన పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది, ఖాళీల వివరాలతో పాటు గత మూడేళ్లలో పోస్టుల భర్తీకి చేపట్టిన చర్యలను వెల్లడించాలని ఎంపీ కోరారు.
కేంద్రం లిఖితపూర్వక సమాధానం:
ఈ ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాధవ్ లిఖితపూర్వక సమాధానమిస్తూ.. ఆరోగ్య సేవలు, ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని స్పష్టం చేశారు. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ద్వారా రాష్ట్రాలు పంపే ప్రతిపాదనల మేరకు ఆర్థిక, సాంకేతిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఖాళీల వివరాలు ‘హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా’ నివేదికలో ఉన్నాయని పేర్కొంటూ, గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత తీర్చేందుకు ప్రత్యేక అలవెన్సులు, ‘యూ కోట్–వీ పే’ వంటి విధానాలు అమలు చేస్తున్నట్లు వివరించారు.
రాష్ట్రాలపై నెట్టేయడం సరికాదు:
కేంద్ర మంత్రి సమాధానంపై ఎంపీ కడియం కావ్య స్పందిస్తూ.. ఆరోగ్యం రాష్ట్ర జాబితాలోని అంశమని చెప్పి కేంద్రం చేతులెత్తేయడం సరికాదన్నారు. ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏకైక దిక్కుగా ఉన్న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో తీవ్రస్థాయిలో వైద్యులు, స్పెషలిస్టులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది కొరత ఉందని, దీనివల్ల సామాన్య రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఆరోగ్య రంగంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి, తెలంగాణకు అదనపు నిధులు కేటాయించాలని డెమాండ్ చేశారు. ఎంజీఎం వంటి కీలక ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను యుద్ధప్రాతిపదికన భర్తీ చేసేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


