హనుమకొండ, శుక్రవారం:
వరంగల్ జిల్లాలో ఎమ్మార్వోగా పనిచేస్తున్న గిరిబాబుపై ఆయన భార్య ఝాన్సీ రాణి తీవ్ర ఆరోపణలు చేశారు. తన భర్త మరో మహిళతో సహజీవనం చేస్తూ తనను, తన పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం హనుమకొండ పోలీస్ స్టేషన్ ఎదుట ఝాన్సీ రాణి నిరసన చేపట్టారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన గిరిబాబు గత కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఉంటూ, మరో మహిళతో నివసిస్తున్నారని ఆమె ఆరోపించారు.
కుటుంబాన్ని పట్టించుకోకుండా మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని, ఈ విషయంపై పలుమార్లు ప్రశ్నించినప్పటికీ స్పందన లేకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు.
ఈ సందర్భంగా వారి పిల్లలు కూడా తమ బాధను వ్యక్తం చేశారు. తండ్రి తమతో ఉండకుండా వేరే మహిళతో జీవించడం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నామని, కుటుంబం విడిపోవడం చాలా బాధగా ఉందని పేర్కొన్నారు. తండ్రి తిరిగి కుటుంబంతో కలిసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
తనకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళతో సహజీవనం చేయడం చట్ట విరుద్ధమని ఝాన్సీ రాణి ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి ఎమ్మార్వోపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.


