వరంగల్‌లో కండలు పెంచే ఇంజెక్షన్ల గుట్టు రట్టు..రూ.15 వేల ఇంజెక్షన్లు సీజ్.. :
వరంగల్ నగరంలో అక్రమంగా కండలు పెంచే ఇంజెక్షన్ల విక్రయం జరుగుతున్నట్లు అందిన సమాచారంతో డ్రగ్ కంట్రోల్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో కీలక విజయం సాధించారు. చారబౌలి ప్రాంతంలో యువకులకు కండరాల పెరుగుదల కోసం ఉపయోగించే ఇంజెక్షన్లను విక్రయిస్తున్న వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకుని భారీ మొత్తంలో మందులను స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్ కంట్రోల్ శాఖ అధికారులైన శ్రవణ్ కుమార్, కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో, టాస్క్ ఫోర్స్ అధికారి ఋశీ పూర్ణచందర్ రెడ్డి సహకారంతో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో మహ్మద్ అబ్దుల్ సోహెబ్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. అతడి వద్ద నుంచి సుమారు రూ.15,827 విలువ చేసే 30 కండలు పెంచే ఇంజెక్షన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రాథమిక విచారణలో ఈ ఇంజెక్షన్లను ఆన్లైన్ ద్వారా తెప్పించుకుని స్థానికంగా యువకులకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా జిమ్‌లకు వెళ్లే యువతను లక్ష్యంగా చేసుకుని ఈ ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. సరైన వైద్యుల సూచనలు లేకుండా ఇలాంటి ఇంజెక్షన్లను వినియోగించడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.
కండరాల పెరుగుదల కోసం ఉపయోగించే కొన్ని ఔషధాలు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు నియంత్రిత నిబంధనల కింద మాత్రమే విక్రయించాల్సి ఉంటుందని, వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా వాటిని అమ్మడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఇలాంటి మందుల దుర్వినియోగం వల్ల కాలేయం, గుండె, మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఈ ఘటనపై డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసిన అధికారులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


