వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎన్నో సంవత్సరాలుగా సేవలందించిన పలువురు పోలీసు అధికారులు ఆదివారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వారికి ఘనంగా వీడ్కోలు పలికి సన్మానించారు.
పరిపాలన విభాగం అదనపు డీసీపీ రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ ఎం.డి. నజీర్, ఆర్‌ఎస్‌ఐ రవికుమార్, ఏఆర్‌ఎస్‌ఐలు రమేష్, మల్లారెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు నారాయణ, అశోక్‌లను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన అదనపు డీసీపీ రవి, ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనాలని సూచించారు. అలాగే పదవీ విరమణ సమయంలో లభించే ఆర్థిక ప్రయోజనాలను జాగ్రత్తగా వినియోగించి కుటుంబ భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ఏఆర్ అదనపు డీసీపీ సురేష్ కుమార్, శ్రీనివాస్, ఏసీపీలు నాగయ్య, అంతయ్య, ఆర్‌ఐలు సతీష్, శ్రీధర్, ఆర్‌ఎస్‌ఐ శ్రావణ్ కుమార్‌తో పాటు కుటుంబ సభ్యులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


