వరంగల్ కమిషనరేట్ పోలీస్ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన సందర్భంగా సోమవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను ఈ కార్యక్రమంలో సత్కరించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న పోలీస్ కమిషనర్ Sunpreet Singh , పతకాలు గెలుచుకున్న క్రీడాకారులను వ్యక్తిగతంగా అభినందించారు. విధి నిర్వహణలో ఎన్నో ఒత్తిడులు ఉన్నప్పటికీ క్రీడల్లో మెరుగైన ప్రదర్శన చేసి పతకాలు సాధించడం అభినందనీయం అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా హాకీ క్రీడాకారులు సంయుక్తంగా కమిషనర్‌కు హాకీ జెర్సీని బహుకరించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో టేబుల్ టెన్నిస్ విభాగంలో కాంస్య పతకం సాధించిన కమిషనర్‌కు ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ చేతుల మీదుగా పతకాన్ని అందజేశారు.
అనంతరం కమిషనర్ మాట్లాడుతూ, గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎక్కువ సంఖ్యలో పతకాలు సాధించడం గర్వకారణమని తెలిపారు. ఇదే ఉత్సాహం కొనసాగిస్తే జాతీయ స్థాయిలో కూడా పతకాలు సాధించడం సాధ్యమని పేర్కొన్నారు. క్రీడల్లో రాణించే వారికి శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డీసీపీలు దార కవిత, అంకిత్ కుమార్, ట్రైనీ ఐపీఎస్ మనీషా నేహ్రా, అదనపు డీసీపీలు సురేష్ కుమార్, రవి, శ్రీనివాస్, ఏసీపీలు నాగయ్య, సురేంద్ర, జితేందర్ రెడ్డి, మధుసూదన్, అంతయ్య, ఆర్‌ఐలు స్పర్జన్ రాజ్, సతీష్, ఇన్‌స్పెక్టర్ శుకూర్, ఆర్‌ఎస్‌ఐ శరత్, మణికృష్ణ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


