ఉన్నత చదువులు చదివి, విదేశాల్లో స్థిరపడి కుటుంబానికి అండగా ఉంటాడనుకున్న ఆ యువకుడు అనంత లోకాలకు వెళ్ళిపోయాడు. అమెరికాలో స్థిరపడిన వరంగల్ జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తాడిపత్రి రాకేష్ (40) గుండెపోటుతో మృతి చెందారు.
వరంగల్ జిల్లాకు చెందిన రాకేష్ వృత్తిరీత్యా అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో స్థిరపడ్డారు. ఆదివారం సాయంత్రం ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.
రాకేష్‌కు 2014లో కరీంనగర్‌కు చెందిన తేజస్వినితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాకేష్ అకాల మరణ వార్త తెలియగానే వరంగల్‌లోని ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. చేతికి అందిన కొడుకు విగతజీవిగా మారాడన్న వార్త ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి.


