వరంగల్: వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన భవనంలో హిమోఫిలియా బాధితుల కోసం ప్రత్యేక వార్డుతో పాటు 24 గంటలూ అందుబాటులో ఉండేలా హిమోఫిలియా ట్రీట్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని హిమోఫిలియా సొసైటీ వరంగల్ చాప్టర్ ప్రభుత్వాన్ని కోరింది. నిరంతరం వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, అత్యవసర క్లాటింగ్ ఫ్యాక్టర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు హిమోఫిలియా సొసైటీ వరంగల్ చాప్టర్ కార్యదర్శి ఎన్. సుమన్ కుమార్, ఉపాధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్ ఆదివారం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కాటం రాంకుమార్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు ఎదుర్కొంటున్న వైద్య, ఆర్థిక, సామాజిక ఇబ్బందులను ఆయనకు వివరించారు.
రక్తస్రావ వ్యాధితో పేదలకు తీవ్ర ఆర్థిక భారం
హిమోఫిలియా అనేది పుట్టుకతో వచ్చే రక్తం గడ్డకట్టని వ్యాధి. చిన్న గాయం లేదా దెబ్బ తగిలినా రక్తస్రావం త్వరగా ఆగక కీళ్లు, కండరాలలో అంతర్గత రక్తస్రావం జరుగుతుందని, సరైన సమయానికి చికిత్స అందకపోతే అంగవైకల్యం లేదా ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉందని సొసైటీ ప్రతినిధులు వివరించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫ్యాక్టర్ ఇంజెక్షన్లు చాలా ఖరీదైనవి కావడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక భారాన్ని మోస్తున్నాయని తెలిపారు.
ఐదు జిల్లాల రోగులకు ప్రధాన ఆధారం
ప్రస్తుతం వరంగల్‌తో పాటు చుట్టుపక్కల ఐదు జిల్లాల నుంచి సుమారు 150 మంది హిమోఫిలియా బాధితులు ఎంజీఎం హాస్పిటల్‌పైనే ఆధారపడి చికిత్స పొందుతున్నారని ప్రతినిధులు పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు నూతన సూపర్ స్పెషాలిటీ భవనంలో 24×7 వైద్య సేవలు, ప్రాణాధార ఇంజెక్షన్లు నిరంతరం లభించేలా ప్రత్యేకం సెంటర్ ఏర్పాటు చేయడం అత్యంత ఆవశ్యకమని సూచించారు.
స్పందించిన ఎంజీఎం సూపరింటెండెంట్
వినతిపత్రం స్వీకరించిన ఎంజీఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కాటం రాంకుమార్ రెడ్డి దీనిపై సానుకూలంగా స్పందించారు. నూతన సూపర్ స్పెషాలిటీ భవనంలో ప్రత్యేక హిమోఫిలియా వార్డు, ట్రీట్మెంట్ సెంటర్ ఏర్పాటు అంశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు సొసైటీ ప్రతినిధులు తెలిపారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


