వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి నిధులను గ్రీన్ ఛానల్ ద్వారా మంజూరు చేస్తున్నప్పటికీ పనుల్లో జాప్యం జరుగుతుండటంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై పనులు వేగవంతం చేసి, వచ్చే 30 రోజుల పాటు 24 గంటలూ నిర్మాణ పనులు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు ఇతర ఆసుపత్రుల నిర్మాణం, అభివృద్ధి పనులపై సీఎం ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి సమీక్షించారు.
వరంగల్ ఆసుపత్రి భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పనులు ముందుకు తీసుకెళ్లాలని, సీఎంఓ అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు.
ప్రతి పనికి ఒక ప్రత్యేక అధికారిని బాధ్యుడిగా నియమించాలని, ఇకపై ఆసుపత్రి నిర్మాణ పనులను ప్రతిరోజూ పర్యవేక్షించాలని వరంగల్ జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు.
భవన నిర్మాణంలో వివిధ శాఖల మధ్య సమన్వయం మరింత మెరుగుపరచాలని, ఇందుకోసం అధికారులతో ప్రత్యేక సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలను రోగులు, వారి కుటుంబ సభ్యులకు అనుకూలంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.
అలాగే సనత్‌నగర్ ఎంసీఆర్ టిమ్స్ తరహాలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఓపీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. సనత్‌నగర్ టిమ్స్‌లో స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణాన్ని కూడా తక్షణమే ప్రారంభించాలని సూచించారు.
ఆసుపత్రి నిర్వహణను ఏజెన్సీకి అప్పగించే అంశంపై కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు.
ఈ సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డితో పాటు వైద్య ఆరోగ్య, రోడ్లు–భవనాలు, మున్సిపల్ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


