వరంగల్ కలెక్టరేట్: కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులోని కిటెక్స్ కంపెనీలో ఉద్యోగ అవకాశాల కల్పనపై వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద సమీక్షా సమావేశం నిర్వహించారు. టైలరింగ్‌పై పట్టున్న లేదా నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న మహిళలకు ఇది ఒక గొప్ప అవకాశం.
కిటెక్స్ కంపెనీలో 1800 స్టిచ్చింగ్ (కుట్టు శిక్షణ) పోస్టులు భర్తీ చేయనున్నారు. 18 నుంచి 35 సంవత్సరాల వయసు గల మహిళలు ఈ ఉద్యోగాలకు అర్హులు. నెలకు రూ. 12,300 నుండి రూ. 21,800 వరకు జీతం ఉంటుంది. ఎంపికైన వారికి ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తారు.
డీఆర్డీఏ (DRDA) ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, మెప్మా-నాబార్డ్ ఎంప్లాయిమెంట్ ద్వారా ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వరంగల్ స్థానిక ప్రజలకు ఈ ఉద్యోగాలలో ప్రాధాన్యత ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో జరిగిన ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వై.వి. గణేష్, పరిశ్రమల శాఖ జీఎం నరసింహమూర్తి, డీఆర్డీఏ పీడీ నాగ పద్మజ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ ఉద్యోగ అవకాశాల గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.


