వరంగల్‌లో ట్రాఫిక్ మార్పులు.. వాహనదారులకు పోలీసుల కీలక సూచన :
హన్మకొండ హంటర్ రోడ్డులో ట్రాఫిక్ రద్దీ, రోడ్డు ప్రమాదాలను తగ్గించడంతోపాటు విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అదాల జంక్షన్ నుంచి నీలిమ జంక్షన్ వరకు ఉన్న మార్గంలో పలు పాఠశాలలు, కళాశాలలు ఉండటంతో ప్రతిరోజూ భారీగా విద్యార్థులు రాకపోకలు సాగిస్తున్నారు.
అధికారుల పరిశీలన :
ఈ ప్రాంతంలో తరచూ ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్, పట్టణ మున్సిపల్ కమిషనర్ వెంకన్న, ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు హంటర్ రోడ్డును పరిశీలించారు. విద్యార్థులు, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరిచే అంశాలపై వారు సమీక్షించారు.
మీడియన్ కటింగ్ తాత్కాలికంగా మూసివేత :
పరిశీలన అనంతరం న్యూ సైన్స్ కాలేజ్ సమీపంలో కొంత దూరం తర్వాత ఉన్న మీడియన్ కటింగ్‌ను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా ఈ మార్పును అమలు చేయనున్నారు. దీని ద్వారా వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించి, ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టనున్నారు.
పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి :
కొత్త ట్రాఫిక్ మార్పును వాహనదారులు గమనించి, విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, రోడ్డు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.


