న్యూఢిల్లీ – పార్లమెంట్ | తేది: 25-03-2026
వరంగల్ జిల్లాలో వాతావరణ మౌలిక సదుపాయాల లోటుపాట్లపై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య లోక్‌సభలో ప్రశ్నించారు. ఇటీవల కాలంలో తీవ్ర వాతావరణ మార్పులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో సరిపడా ఆధునిక వాతావరణ పర్యవేక్షణ వ్యవస్థలు లేకపోవడం ఆందోళనకరమని ఆమె పేర్కొన్నారు.
ఈ అంశంపై స్పందించిన భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి డా. జితేంద్ర సింగ్, ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఐదు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు (AWS), వర్షపాతం కొలిచే గేజ్‌లు పనిచేస్తున్నాయని తెలిపారు. అయితే, జిల్లాలో డాప్లర్ వెదర్ రాడార్ (DWR) ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్, విశాఖపట్నంలో ఉన్న రాడార్ల ద్వారా వరంగల్‌కు సేవలు అందుతున్నాయని వివరించారు. అలాగే జిల్లాలో ప్రత్యేక వరద హెచ్చరిక కేంద్రం లేకపోయినా, సమీప ప్రాంతాల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు.
దీనిపై స్పందించిన ఎంపీ కడియం కావ్య, ఇతర ప్రాంతాలపై ఆధారపడటం వల్ల అత్యవసర పరిస్థితుల్లో స్పందన ఆలస్యమయ్యే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా స్థాయిలో ఖచ్చితమైన వాతావరణ అంచనాలు, మెరుపు హెచ్చరిక వ్యవస్థలు, క్లైమేట్ రెసిలియెన్స్ మెకానిజంలను బలోపేతం చేయాలని కేంద్రాన్ని కోరారు.
‘మిషన్ మౌసమ్’ వంటి కార్యక్రమాలు అమలులో ఉన్నప్పటికీ, వరంగల్ వంటి సున్నిత ప్రాంతాలకు ప్రత్యేక పెట్టుబడులు అవసరమని ఆమె స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించేందుకు ముందస్తు చర్యలు, సమగ్ర విపత్తు నిర్వహణ వ్యవస్థలను మరింత పటిష్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


