వరంగల్: నగరంలోని పడమర కోట చమాన్ సమీపంలో శుక్రవారం రాత్రి కొందరు యువకులు గంజాయి మత్తులో వీరంగం సృష్టించారు. స్థానిక మిఠాయి దుకాణంలోకి చొరబడిన ఈ గ్యాంగ్, షాపు యజమానితో అనవసరంగా గొడవకు దిగారు.
మత్తులో ఊగిపోతూ షాపులోని వస్తువులను చిందరవందరగా పడేశారు. కేవలం గొడవ చేయడమే కాకుండా, షాపులోని వెయింగ్ మెషిన్ మరియు తినుబండారాలను ధ్వంసం చేస్తూ బీభత్సం సృష్టించారు. యువకుల ప్రవర్తనతో షాపు యజమాని కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఈ అరాచకానికి సంబంధించిన దృశ్యాలన్నీ షాపులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, స్థానికులు తీవ్రంగా స్పందిస్తున్నారు. గంజాయి బ్యాచ్‌ల ఆగడాలు మితిమీరిపోతున్నాయని, పోలీసులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని వరంగల్ వాసులు కోరుతున్నారు.


