రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భార్య, ఇద్దరు బాలికల హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడితో పాటు మరో తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, వరంగల్ జిల్లా ఐనవోలు మండలం పున్నెలు గ్రామానికి చెందిన యం.డి అజారుద్దీన్ (29) తన భార్య ఫరహాత్‌ను 2016లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు జన్మించారు. అయితే, కుటుంబ సభ్యులు కుమారుడు పుట్టాలని ఒత్తిడి తీసుకురావడంతో, మృతురాలు గర్భం దాల్చిన ప్రతిసారి ఆడపిల్ల పుడుతుందనే అపనమ్మకంతో బలవంతంగా గర్భస్రావాలు చేయించినట్లు విచారణలో వెల్లడైంది.

ఇదే సమయంలో మరో యువతితో సంబంధం పెట్టుకున్న అజారుద్దీన్, ఆమెను వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో భార్య, పిల్లలు అడ్డంకిగా మారారని భావించి హత్యకు కుట్ర పన్నాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ నెల 1వ తేదీన రాత్రి భార్య, పిల్లలను ఐస్‌క్రీమ్ తినిపిస్తానని చెప్పి స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ సీసీ కెమెరాలు, విద్యుత్‌ను నిలిపివేసి వారిని బలవంతంగా నీటిలోకి నెట్టి ముంచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
హత్య అనంతరం ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా నిందితుడు ప్రచారం చేశాడు. అయితే, మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టి నిజానిజాలను వెలికితీశారు.
ఈ కేసులో నిందితుడి కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది వైద్యులు, సిబ్బంది కూడా లింగ నిర్ధారణ, అక్రమ గర్భస్రావాలకు సహకరించినట్లు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
ఈ కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.


