రైతులకు హెచ్చరిక: పంట అవశేషాలు కాల్చొద్దు.. కలెక్టర్ సీరియస్ వార్నింగ్ :
హనుమకొండ: పర్యావరణ పరిరక్షణ ప్రజారోగ్య భద్రత మరియు భూసారాన్ని కాపాడే లక్ష్యంతో హనుమకొండ జిల్లా వ్యాప్తంగా పంట అవశేషాలు కాల్చివేత పై సంపూర్ణ నిషేధం విధిస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ చాహత్ బాజ్‌పాయ్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
వ్యవసాయ పంటల కోత అనంతరం పొలాలలో మిగిలిపోయే అవశేషాలను తగులుపెట్టడం వల్ల వాయు కాలుష్యం తీవ్రంగా పెరుగుతుందని.. హానికర వాయువులు విడుదలై ప్రజల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతాయని కలెక్టర్ తెలిపారు. అంతేకాకుండా భూమిలోని సేంద్రియ పదార్థాలు ఉపయోగకరమైన సూక్ష్మజీవుల నశించి భూసారం తగ్గిపోవడంతో పాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని పేర్కొన్నారు.
ప్రజా శాంతిభద్రతలు, పర్యావరణ రక్షణ మరియు భద్రతాపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS)-2023 సెక్షన్ 163 కింద కల్పించిన అధికారాలను వినియోగిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, వ్యవసాయ భూములు మరియు పొలాల్లో పంట అవశేషాలను కాల్చడం పూర్తిగా నిషేధించబడిందని వెల్లడించారు.
ఈ ఉత్తర్వులను ఉల్లంఘించే వారిపై భారతీయ న్యాయ సంహిత (BNS)-2023 సెక్షన్ 223 ప్రకారం కేసులను నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉల్లంఘనల కారణంగా ప్రజలకు ఇబ్బందులు లేదా ప్రాణాపాయం కలిగితే జైలు శిక్షతో పాటు జరిమాణాలు కూడా విధించే అవకాశం ఉందని సూచించారు.
అమలులో భాగంగా తహసిల్దారులు, ఎంపీడీవోలు, వ్యవసాయ అధికారులు, పంచాయితీ కార్యదర్శులు, పోలీసు అధికారులు గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. పంట కోతల సమయంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిబంధనలను ఉల్లంఘించిన వారిపై వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులు పంట అవశేషాల నిర్వహణకు ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పిలుపునిచ్చారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


