వాతావరణ శాఖ హెచ్చరిక.. నెక్స్ట్ 3 రోజుల్లో ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు ఖాయం:
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచనలు జారీ చేసింది. రుతుపవన ద్రోణి, మధ్యప్రదేశ్ పరిసరాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఉత్తర కోస్తా, యానాంలో వర్షాలు:
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. శనివారం ఉరుములతో కూడిన వర్షాలతో పాటు గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది.
దక్షిణ కోస్తాలోనూ వానలు:
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో గురువారం కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్ర, శనివారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండగా, గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రాయలసీమలో ఈదురుగాలులు:
రాయలసీమలో మూడు రోజుల పాటు ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. వర్షాల సమయంలో 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
తెలంగాణలోనూ వర్షాలు:
తెలంగాణలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉండగా, కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.


