హనుమకొండ: ఎల్కతుర్తి బస్టాండ్ వెనుక కారులో యువతి మృతదేహం లభ్యమైన కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు.
కారులో మృతదేహం గుర్తింపు:
గత బుధవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు హ్యుందాయ్ ఆరా కారును బస్టాండ్ వెనుక పార్క్ చేసి వెళ్లారు. రెండు రోజులుగా కారు అక్కడే ఉండటంతో శుక్రవారం దుర్వాసన రావడాన్ని స్థానికులు గుర్తించారు. గ్రామ కార్యదర్శికి సమాచారం ఇవ్వడంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కారు డిక్కీ తెరిచి చూడగా దుప్పటిలో చుట్టి ఉంచిన యువతి మృతదేహం బయటపడింది.
మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు:
కారు యజమానిని విచారించగా, తాను డబ్బుల కోసం కారును ఉంచినట్లు, దానిని ఎడవల్లి వినోద్‌కుమార్ ఉపయోగిస్తున్నట్లు వెల్లడించాడు. దీంతో పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలించారు. ఆగస్టు 23న పెట్రోలింగ్ సమయంలో నాగార్జున సీడ్ ప్రాసెస్ ప్లాంట్ వద్ద వినోద్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.
పెళ్లి విషయంలో వివాదం :
పోలీసుల విచారణలో మృతురాలు అంకతి మానస తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసిందని వినోద్ తెలిపినట్లు ఏసీపీ పేర్కొన్నారు. మానస తండ్రి అంకతి రాజేశం కూడా ఆమెను హత్య చేయాలని వినోద్‌ను కోరినట్లు విచారణలో వెల్లడైందన్నారు. దీంతో అరుణాచలం వెళ్దామని చెప్పి మానసను కరీంనగర్‌లోని తన అద్దె గదికి తీసుకెళ్లిన వినోద్, మరుసటి రోజు పెళ్లి విషయమై జరిగిన గొడవలో ఆమెను గొంతు పిసికి హత్య చేసినట్లు అంగీకరించాడని తెలిపారు.
మానస తండ్రి వినోద్‌కు రూ.12 వేల నగదు ఇచ్చినట్లు విచారణలో వెల్లడైందని ఏసీపీ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నట్లు చెప్పారు.


