ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో వినియోగదారులకు మరోసారి అదనపు ఛార్జ్ విధిస్తోంది. ఇకపై క్యాష్ ఆన్ డెలివరీ (COD) ద్వారా ఆర్డర్ చేసే కస్టమర్ల నుంచి అదనంగా రూ.5 వసూలు చేస్తున్నట్లు వెల్లడించాయి. ఈ మొత్తాన్ని యాప్‌లోని బిల్ సమ్మరీలో ప్రత్యేకంగా చూపిస్తున్నారు.
ప్రాంతాన్ని బట్టి ఛార్జ్ మార్పు :
సాధారణంగా ఈ రుసుము రూ.5గా ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాలు, ఆర్డర్లను బట్టి రూ.7 నుంచి రూ.20 వరకు వసూలు చేస్తున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. అయితే యూపీఐ, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ వంటి ఆన్‌లైన్ పేమెంట్ పద్ధతులను ఎంచుకునే వారికి ఈ ఛార్జ్ వర్తించదు.
ఏడాదికి వందల కోట్ల ఆదాయం? :
జొమాటో ఇప్పటికే ప్లాట్‌ఫామ్ ఫీజు, రెస్టారెంట్ ప్యాకేజింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి వివిధ రుసుములను వసూలు చేస్తోంది. ప్రస్తుతం ఒక్కో ఆర్డర్‌పై ప్లాట్‌ఫామ్ ఫీజు రూ.14.99 వరకు ఉంది. సంస్థ రోజుకు సగటున 23 నుంచి 25 లక్షల ఆర్డర్లను ప్రాసెస్ చేస్తుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో CODపై విధించే చిన్న మొత్తమే భారీ ఆర్డర్ వాల్యూమ్ కారణంగా సంస్థకు గణనీయమైన అదనపు ఆదాయాన్ని తీసుకురావచ్చని అంచనా.
స్విగ్గీలో ఇంకా అమలు కాలేదు :
జొమాటో ప్రధాన ప్రత్యర్థి స్విగ్గీ మాత్రం ఇప్పటివరకు ఇలాంటి COD ఛార్జ్‌ను ప్రారంభించలేదు. కొత్త ప్లాట్‌ఫామ్‌ల నుంచి పోటీ పెరుగుతున్న సమయంలో జొమాటో వరుసగా కొత్త చెక్‌అవుట్ ఫీజులను ప్రవేశపెట్టడం చర్చనీయాంశంగా మారింది.


