హనుమకొండ: ప్రతి పౌరుడూ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులతో పాటు తమ బాధ్యతలను కూడా తప్పక గుర్తుంచుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత పిలుపునిచ్చారు.
మంగళవారం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ వరంగల్ ఫీల్డ్ కార్యాలయం ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా’పై ఏర్పాటు చేసిన రెండు రోజుల ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ అండ్ ఔట్రీచ్ ప్రోగ్రామ్ (ICOP), ఫోటో ఎగ్జిబిషన్‌ను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయితో కలిసి సీపీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వరంగల్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ తరుణ్ కుమార్ బోడా జాతీయ పతాక ప్రస్థానం, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను తెలియజేసే ఫొటో ప్రదర్శన వివరాలను విశదీకరించారు.
యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు:
అనంతరం సీపీ శ్వేత మాట్లాడుతూ.. “కేవలం హక్కుల కోసం పోరాడడం నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు మన బాధ్యత ఏంటో తెలుసుకోవడం అంతే ముఖ్యం. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడంలోనూ, దేశ అభివృద్ధిలోనూ యువత క్రియాశీలక పాత్ర పోషించాలి. మన భవిష్యత్తును మనం మలచుకోవడమే కాకుండా రాబోయే తరాలకు ఎలాంటి సమాజాన్ని అందిస్తామనేది వంద శాతం మన చేతుల్లోనే ఉందన్నారు.”
స్వతంత్ర భారతంలో జన్మించడం మన అదృష్టం: కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి మాట్లాడుతూ.. “ఎంతోమంది పోరాటాలు, త్యాగాల ఫలితంగా లభించిన ప్రజాస్వామ్య వ్యవస్థలో జన్మించడం మనకు లభించిన గొప్ప అవకాశం. మన జాతీయ జెండా ఒక్క రోజులో రూపుదిద్దుకున్నది కాదు, దీని వెనుక ఎంతో కృషి ఉంది. మనకు లభించిన ఈ స్వేచ్ఛను, రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు మరింత బలమైన ప్రజాస్వామ్యాన్ని అందించాలి” అని పేర్కొన్నారు. విద్యార్థులు నిర్వహించిన పోటీలలో ఉత్సాహంగా పాల్గొనడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమం గురించి కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి. శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులలో దేశభక్తిని, బాధ్యతారాహిత్యాన్ని తొలిగించి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు, బహుమతుల ప్రదానం:
కార్యక్రమంలో భాగంలో కళా బృందాలు ‘హర్ ఘర్ తిరంగా’ అంశంపై ప్రదర్శించిన యక్షగానం విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం క్విజ్, వక్తృత్వ, వ్యాసరచన పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ రజనీ లత, ప్రోగ్రామ్ ఇన్‌ఛార్జి సమత, అధ్యాపకులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗽𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


