హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి గ్రామానికి చెందిన బేతి మల్లేశం–అరుణ దంపతుల కుమారుడు బేతి విక్రమ్ యూపీఎస్సీ పరీక్షల్లో 472వ ర్యాంక్ సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచారు.
శుక్రవారం ప్రకటించిన యూపీఎస్సీ ఫలితాల్లో విక్రమ్ ఈ ప్రతిష్టాత్మక ర్యాంక్ సాధించడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా శనివారం గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో విక్రమ్ నివాసానికి వెళ్లి ఆయనను, కుటుంబ సభ్యులను ఘనంగా అభినందించారు.
విక్రమ్ కృషి, పట్టుదల గ్రామ యువతకు ఆదర్శంగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు. ఈ విజయంతో గర్మిళ్లపల్లి గ్రామానికి మంచి గుర్తింపు తీసుకువచ్చిన విక్రమ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆశీర్వదించారు.


