హన్మకొండ | తేది: 19-03-2026
స్టేషన్ ఘనపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల బ్రోచర్‌ను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హన్మకొండ కనకదుర్గ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వ కళాశాలలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ, స్టేషన్ ఘనపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఉచిత కంప్యూటర్ శిక్షణ, స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు వంటి సదుపాయాలు విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడతాయని చెప్పారు.
అలాగే విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్, టీఎస్కేసీ (TSKC) ద్వారా ఉద్యోగావకాశాలు, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు, పోటీ పరీక్షల మార్గదర్శకత్వం వంటి అనేక సదుపాయాలు అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బత్తిని చంద్రమౌళి, అధ్యాపకులు నాగరాజు, సుమలత, అఖిల తదితరులు పాల్గొన్నారు.

