చిన్నారుల్లో ఫ్యాటీ లివర్ అలర్ట్:
ఇటీవల చిన్నారుల్లో ఫ్యాటీ లివర్ సమస్య వేగంగా పెరుగుతుండడం వైద్యులను ఆందోళనకు గురిచేస్తుంది. ఒకప్పుడు పెద్దవారిలో మాత్రమే ఎక్కువగా కనిపించిన ఈ వ్యాధి ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా నమోదు అవుతుంది. అధికంగా జంక్ ఫుడ్ తీసుకోవడం మొబైల్ ఫోన్లు, టీవీల ముందు ఎక్కువ సమయం గడపడం శారీరక వ్యాయామం లేకపోవడం.. ఊబకాయం పెరగడం వంటి కారణాలు దీనికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. కాలేయంలో అధిక కొవ్వు పేరుకుపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.
కారణం లేకుండానే అలసట :
పిల్లలు ఎలాంటి శ్రమ చేయకపోయినా తరచూ అలసటగా కనిపించడం ఫ్యాటీ లివర్ కి తొలి సంకేతంగా భావిస్తున్నారు. ఎప్పుడు నీరసంగా ఉండడం, చిన్న పనికి అలసిపోవడం, చురుకుదనం తగ్గిపోవడం వంటి లక్షణాలను తల్లిదండ్రులు గమనించాలి. ఇవి కాలేయ పనితీరు ప్రభావితమవుతున్న సూచనలుగా ఉండొచ్చు.
చర్మంలో మార్పులు:
మెడ చుట్టూ నల్లటి మచ్చలు కనిపించడం. చర్మం కాంతి కోల్పోవడం లేదా అనారోగ్యంగా కనిపించడం కూడా ఫ్యాటీ లివర్ కి సంకేతాలుగా వైద్యులు చెబుతున్నారు. ఇవి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తో పాటు కాలేయ సమస్యలను సూచించే అవకాశం ఉంది.
జీర్ణ సమస్యలు పెరిగితే అప్రమత్తం:
తరచూ కడుపు ఉబ్బరం, కుడి వైపు పై భాగంలో నొప్పి లేదా అసౌకర్యం కనిపించడం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్, చెక్కర పానీయాలు ఎక్కువగా తీసుకునే పిల్లల్లో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
జీవనశైలిలో మార్పులు తప్పనిసరి:
అధిక బరువు ఉన్న పిల్లల్లో ఫ్యాటీ లివర్ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రారంభ దశలోనే గుర్తిస్తే జీవన శైలిలో మార్పులతో నియంత్రించవచ్చు. పిల్లలను బయట ఆటలకు ప్రోత్సహించడం. పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఇవ్వడం . జంక్ ఫుడ్ తగ్గించడం అవసరం. నిరంతరం అలసట, ఆకస్మిక బరువు పెరుగుదల లేదా రక్త పరీక్షల్లో మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


