శ్రావణంలో ఈ ఆకుకూరలు ఎందుకు తినరు? సంప్రదాయం వెనుక ఆసక్తికర కారణాలు:
శ్రావణ మాసాన్ని హిందువులు ఎంతో పవిత్రమైన నెలగా భావిస్తారు. ఈ సమయంలో పండగలు, వ్రతాలు, పూజలు ఎక్కువగా ఉండటంతో చాలామంది నెల రోజుల పాటు మాంసాహారానికి దూరంగా ఉంటారు. అయితే ఆధ్యాత్మిక కారణాలతో పాటు వర్షాకాలంలో ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
నాన్‌వెజ్‌కు ఎందుకు దూరం?
వర్షాకాలంలో జీర్ణక్రియ కొంత మందగించే అవకాశం ఉంటుంది. దీంతో మాంసాహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. అందుకే ఈ సీజన్లో తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం మంచిదని చెబుతారు.
ఆకు కూరలతోనూ జాగ్రత్త :
వర్షాకాలంలో కేవలం నాన్‌వెజ్ మాత్రమే కాకుండా కొన్ని ఆకుకూరలను కూడా తగ్గించాలని సూచిస్తారు. ముఖ్యంగా గోంగూర, పాలకూర, మెంతికూర, ఆవాల ఆకులు వంటి వాటిపై తేమ కారణంగా బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు పెరిగే అవకాశం ఉంటుంది. సరిగ్గా శుభ్రం చేయకుండా లేదా ఉడికించకుండా తీసుకుంటే ఇన్ఫెక్షన్లు, జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
పూర్తిగా మానేయాల్సిందేనా? :
ఈ ఆకుకూరల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వాటిని పూర్తిగా మానేయడం కంటే వర్షాకాలంలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం ముఖ్యం. ఆకులను నీటితో బాగా శుభ్రం చేసి, పూర్తిగా ఉడికించి తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు.


